చరిత్ర సృష్టించిన భారత్: వరి ఉత్పత్తిలో తొలి స్థానం, రెండో స్థానానికి చైనా
చరిత్ర సృష్టించిన భారత్: వరి ఉత్పత్తిలో తొలి స్థానం, రెండో స్థానానికి చైనా
150 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారత్
ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఇది భారత వ్యవసాయ రంగం సాధించిన చారిత్రక విజయంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకప్పుడు ఆహార కొరతతో ఇబ్బంది పడిన భారత్, నేడు ప్రపంచ దేశాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని చౌహాన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త అధిక దిగుబడి వంగడాలను మంత్రి విడుదల చేశారు. వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులు, నేలల లవణీయత వంటి సవాళ్లను తట్టుకునేలా ఈ విత్తనాలను రూపొందించామని ఆయన తెలిపారు. గత 11 ఏళ్లలో మొత్తం 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు.
భారత్ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రధాన దేశంగా మారిందని మంత్రి వెల్లడించారు. ఈ కొత్త వంగడాలు త్వరితగతిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశాన్ని వ్యవసాయరంగంలో మరింత స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఘన విజయం సాధ్యమైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత రైతుల కృషి, శాస్త్రవేత్తల పరిశోధనలు కలిసి దేశాన్ని ప్రపంచ వ్యవసాయ శక్తిగా నిలబెట్టాయని ఆయన ప్రశంసించారు.
Tags:
జాతీయం

Comments