ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుదాం.. కీటకాల వ్యాధులు అరికట్టదాం
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల పరిధిలో జ్వరాలు, కీటకాల ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణకు వైద్యవిభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కానగూడూరు, కృష్ణంపల్లె గ్రామాల్లో ‘ఫ్రైడే అండ్ డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఫీవర్, లార్వా సర్వే నిర్వహించారు.
దువ్వూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి జ్వరలక్షణాలు, దోమల లార్వా కోసం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు జనార్ధన్ రావు మాట్లాడుతూ, దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఇళ్లలో నీరు నిల్వ ఉండే బాణాలు, కుండలు, తొట్లు, కూలర్లు తదితర పాత్రల్లోని నీటిని వారానికి ఒక రోజు పూర్తిగా ఖాళీ చేసి ఆరబెట్టాలని సూచించారు.
ఇలా చేయడం వల్ల గుడ్డు, లార్వా దశలలోనే దోమలను నివారించి డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి అంటువ్యాధులను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచితే కీటకాల ద్వారా వ్యాపించే స్క్రబ్ టైఫస్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా నివారించవచ్చని జనార్ధన్ రావు జాగ్రత్తలు వివరించారు.
పచ్చిక, పొదలు, పొలాలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాల్లో ఉండే సూక్ష్మ కీటకాల (చిగ్గర్ మైట్) కాట్ల ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
నీరు నిలిచే ప్రదేశాలు, చెత్త కుప్పలు, పొదలను తొలగిస్తే కీటకాల పెరుగుదల గణనీయంగా తగ్గుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ ప్రభ, ఏఎన్ఎంలు లోమి, రాణమ్మ, సుగుణతో పాటు ఆశావర్కర్లు శివమ్మ, రవణమ్మ పాల్గొన్నారు.
గ్రామాలలో ప్రజల్లో ఆరోగ్యసుధారణపై చైతన్యం కోసం సిబ్బంది ఇంటి పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వ ఉండనీయకూడదన్న అంశంపై ప్రత్యేకంగా అవగాహన సృష్టించారు.
Please subscribe B10👈👈👈👈👈👈

Comments