B10వార్త

🔍

నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. రూ. 45 వేల మందులు సీజ్



తెలంగాణ /​చిట్యాల/భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డాక్టర్ గుట్టును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు రట్టు చేశారు. చిట్యాల మండలం జడలపేట గ్రామంలో ఎలాంటి వైద్య అర్హతలు లేని వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో డీసీఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

​పట్టుబడిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్

ఈ దాడుల్లో నకిలీ వైద్యుడు రోగులకు ఇష్టానుసారంగా ఇచ్చేందుకు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 రకాల మందులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కేవలం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (RMP/MBBS) సూచన మేరకే వాడాల్సిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన ఈ మందుల విలువ సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా వేశారు.

​ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించం..

కనీస వైద్య అర్హతలు లేని వ్యక్తులు క్లినిక్‌లు తెరవడం, రోగులకు అత్యంత ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతమని డీసీఏ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి నకిలీ వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Please subscribe B10👈👈👈👈👈


 

Tags: జాతీయం

Comments