నిర్లక్ష్యం వద్దు.. భద్రత ముద్దు! శిరివెళ్ళ మెట్ట హైవేపై ప్రాణ రక్షణే లక్ష్యంగా 'బస్సు యాత్ర'
వాహనదారులకు పోలీసు, ఆర్టీవోల దిశానిర్దేశం..
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: డీఎస్పీ శ్రీనివాసరావు..
మెట్ట హైవేపై కరపత్రాల పంపిణీ
శిరివెళ్ళలో విజయవంతమైన బస్సు యాత్ర...
స్థానిక మెట్ట నేషనల్ హైవే వద్ద రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో 'రోడ్డు భద్రత - బస్సు యాత్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్టీవో, నేషనల్ హైవే అధికారులతో పాటు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ డి. రాము, ఎస్సైలు మధుసూధన్, పీరయ్య తదితర పోలీసు సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు.
ఈ బస్సు యాత్ర ద్వారా హైవే వెంట ప్రయాణిస్తున్న వాహనదారులకు, స్థానిక ప్రజలకు అధికారులు ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగంగా వెళ్లడం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. 'భద్రతే ప్రధానం' అనే సందేశంతో ఆర్టీవో అధికారులు పలు సూచనలు చేయగా, రహదారులపై భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని నేషనల్ హైవే అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రయాణికులు, స్థానికుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Comments